ప్రెస్ రిలీజ్
2009 డిసెంబరు 17 నుండి 27 వరకు 24 వ హైదరాబాదు బుక్‌ఫెయిర్
హైదరాబాదులో పుస్తక ప్రదర్శనను నిర్వహించాలని 1985 లో హైదరాబాదులోని ప్రముఖ ప్రచురణ సంస్థలు, పుస్తక విక్రేతలతో హైదరాబాదు బుక్‌ఫెయిర్ సొసైటీ ఏర్పడి మొదటి హైదరాబాద్ బుక్‌ఫెయిర్‌ను అశోక్‌నగర్ లోని సిటీ గ్రంథాలయ సంస్థలో నిర్వహించింది. మొదటి ప్రదర్శనకు పాఠకుల నుండి, ప్రజలనుండి అత్యంత ఆదరణ లభించింది. ఆ తర్వాత హైదరాబాద్ బుక్‌ఫెయిర్‌ను నిజాం కాలేజీ గ్రౌండ్స్, పబ్లిక్ గార్డెన్స్, ఎగ్జిబిషన్ గ్రౌండ్, కేశవ మెమోరియల్ హైస్కూల్ గ్రౌండ్స్‌లలో, గత రెండు సంవత్సరాల నుండి పీపుల్స్ ప్లాజా గ్రౌండ్స్, నెక్లెస్ రోడ్ లో నిర్వహించాము. స్పందన బాగుండటంతో ఈ సంవత్సరం కూడా అదే స్థలంలో నిర్వహించాలని భావించాము. ఈ విధంగా ఇప్పటికి 23 ప్రదర్శనలను నిర్వహించాము. విద్యార్థులలోను, పాఠకులలోనూ పఠనాసక్తిని పెంచి వారి విజ్ఞాన వికాసాలకు తోడ్పడాలనేదే హైదరాబాదు బుక్‌ఫెయిర్ ఆశయం, లక్ష్యం.
24వ బుక్‌ఫెయిర్ 2009 డిసెంబరు 17 న ప్రారంభం కానుంది. హైదరాబాద్ బుక్‌ఫెయిర్ భారతదేశంలో నిర్వహిస్తున్న పుస్తక ప్రదర్శనల్లో కలకత్తా బుక్‌ఫెయిర్ తర్వాత నాణ్యమైన పుస్తక ప్రదర్శనగా పేరొందింది. రాష్ట్రంలోని ప్రముఖ పుస్తక విక్రేతలు, ప్రచురణ కర్తలే కాక దేశంలోని సుప్రసిద్ధ ప్రచురణకర్తలెందరో ఈ ప్రదర్శనలో పాల్గొంటున్నారు. ఆక్స్‌ఫోర్డ్ యూనివర్సిటీ ప్రెస్, కేంబ్రిడ్జి యూనివర్సిటీ ప్రెస్, సేజ్, పెంగ్విన్, ఓరియంట్ బ్లాక్‌స్వాన్ లాంటి అంతర్జాతీయ సంస్థలు కూడా పాల్గొంటున్నాయి.
ఈ ప్రదర్శనలో 200 స్టాల్స్ దాకా వస్తున్నాయి. అందులో 10 స్టాల్స్ ప్రముఖ దినపత్రికలకు కేటాయించాము. 120 స్టాల్స్ ఇంగ్లీషు పుస్తకాలు, 50 స్టాల్స్ తెలుగు పుస్తకాలు, ఇంకా హిందీ, ఉర్దూ భాషలలో కూడా పుస్తకాల స్టాల్స్ ఉంటాయి. ప్రభుత్వరంగ సంస్థలయిన నేషనల్ బుక్ ఇండియా, కేంద్ర సాహిత్య అకాడమీ, పబ్లికేషన్ డివిజన్, తెలుగు అకాడమీ, తెలుగు విశ్వవిద్యాలయము వారు కూడా ఈ ప్రదర్శనలో పాల్గొంటున్నారు. ఈ ప్రదర్శనకు ఢిల్లీ, చెన్నై, కలకత్తా, బొంబాయి, విజయవాడలకు చెందిన ప్రముఖ పబ్లిషర్లందరూ పాల్గొంటున్నారు. ఈ ప్రదర్శనలో పుస్తకాలతో పాటుగా వైజ్ఞానిక సంబంధమైన సి.డిలు కూడా లభ్యమవుతాయి.
ఈ ప్రదర్శనలో పురాణ సాహిత్యం, నవలలు, కథలు, పిల్లల పుస్తకాలు, విద్యార్థుల పుస్తకాలు, విద్యాసంబంధమయిన పుస్తకాలు, టెస్ట్ పుస్తకాలు, ఇంజనీరింగ్, మెడికల్, అభ్యుదయ సాహిత్యం, కాల్పనిక సాహిత్యం లాంటి కె.జి నుంచి పి,జి వరకు అన్ని వయసుల వారికి అన్ని రంగాల వారికి అవసరమైన పుస్తకాలు ఉంచుతున్నాము.
ఈ ప్రదర్శనను 2009 డిసెంబరు 17 వ తేదీ సాయంత్రం ప్రారంభించనున్నాము. 24 వ హైదరాబాద్ బుక్‌ఫెయిర్ డిసెంబరు 17 న ప్రారంభమై 27 వరకు జరుగుతుంది. ప్రతిరోజు మధ్యాహ్నం 2 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు, శని, ఆది వారం రోజుల్లో మధ్యాహ్నం 12 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు బుక్‌ఫెయిర్‌ను సందర్శించవచ్చు. ఈ పుస్తక ప్రదర్శనలో కొనుగోలుదారులకు 10% డిస్కౌంటు ఇస్తారు.
ఈ ప్రదర్శనలో సొంతంగా పుస్తకాలు ప్రచురించిన రచయితలను ప్రోత్సహించడానికి రైటర్ హాల్ పేరుతో స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నాము. ఆసక్తి ఉన్న రచయితలు డిసెంబరు 13వ తేదీలోగా రూ 100/- రిజిస్ట్రేషను రుసుము చెల్లించి నమోదు చేసుకుంటే రైటర్స్ హాల్లో ఒక షెల్ఫ్ కేటాయిస్తాము.
పుస్తక ప్రదర్శనకు ప్రవేశరుసుము 5 రూపాయలు. దాదాపు లక్ష వరకు ఫ్రీ పాసులను విద్యాసంస్థలకు, ప్రముఖులకు, రచయితలకు, సంస్థలకు పంపుతున్నాము. విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, జర్నలిస్టులకు, తమ ఐడెంటిటీ కార్డు చూపించడం ద్వారా ప్రదర్శనకు ఉచితంగా ప్రవేశం లభిస్తుంది.
బుక్‌ఫెయిర్ సందర్భంగా డిసెంబర్ 19 వ తేదీ శనివారం సాయంత్రం 4 గంటలకు పుస్తక ప్రియుల పాదయాత్ర (వాక్ ఫర్ బుక్స్) నిర్వహించాలన్ బుక్‌ఫెయిర్ కమిటీ భావించింది. వాక్ ఫర్ బుక్స్ కార్యక్రమంలో రచయితలను కవులను కళాకారులను ఆర్టిస్టులను భాగస్వాములను చేయాలని భావించాము. బుక్‌ఫెయిర్ వేదికగా అనేక పుస్తకావిష్కరణ సభలు, పరిచయ సభలు, రచయిత రచయిత్రులతో ముఖాముఖి కార్యక్రమాలు, సాహిత్యానికి సేవచేసిన ప్రముఖులకు అభినందన సభలు, 2009 ఉత్తమ పుస్తకాల ప్రదర్శన కార్యక్రమాలను నిర్వహించనున్నాము. బుక్‌ఫెయిర్ విజయవంతం చేయడంలో సినీకళాకారుల సహకారాన్ని కూడా తీసుకోవాలని భావించాము.
బుక్‌ఫెయిర్‌లో స్టాల్ తీసుకోవడానికి అప్లికేషన్ కొరకు, ఇతర సమాచారం కొరకు www.hyderabadbookfair.com ను విజిట్ చేయవచ్చును. బుక్‌ఫెయిర్ సమాచారాన్ని విస్తారమైన పాఠకులకు అందించడానికి మీడియా సహకారాన్ని ఆశిస్తూ..
అభివందనములతో
————————————-
0 Responses
Stay in touch with the conversation, subscribe to the RSS feed for comments on this post.